విడుదల తేదీ : 17 అక్టోబర్ 2013 TeluguWorld.wap.sh : 3.25/5 దర్శకుడు : వీరూ పోట్ల నిర్మాత : డా. ఎం. మోహన్ బాబు సంగీతం : మణిశర్మ నటీనటులు : మంచు విష్ణు, లావణ్య త్రిపాటి..
మంచు విష్ణు హీరోగా, లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన సినిమా ‘దూసుకెళ్తా’. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఈ రోజు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని డా.ఎం. మోహన్ బాబు నిర్మించాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాతో విజయాన్ని అందుకొని ఫుల్ హ్యాపీగా ఉన్న విష్ణు ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని నమ్మకంగా ఉన్నాడు. ‘దూసుకెళ్తా’తో మంచు విష్ణు మరో విజయాన్ని అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం…
కథ :
వెంకటేశ్వరరావు అలియాస్ చిన్నా(మంచు విష్ణు)కి చిన్ననాటి నుంచి తనకి ఇష్టమైన పని చేయడం అలవాటు. అలాగే తనకి ఎవరన్నా చిన్న సాయం చేసినా వాళ్ళని గుర్తు పెట్టుకొని మరి వారికి సాయం చేస్తాడు. అలాంటి చిన్నా చిన్నప్పుడు చేసిన ఓ ఆకతాయి పనివల్ల తన తల్లి తండ్రులు సొంత ఊరైన పిచ్చేశ్వరం వదిలి వేరే ఊరు పారిపోవాల్సి వస్తుంది. అలా వేరే ఊర్లో ఉన్న చిన్నా ఒక రిపోర్టర్ గా టీవీ 2 1/2 చానల్ లో చేరుతాడు. ఆ బ్రాంచ్ హెడ్ అయిన అవతార్(పోసాని కృష్ణ మురళి) మంత్రి డిల్లేశ్వరరావు (పంకజ్ త్రిపాటి) థర్మల్ ప్రాజెక్ట్ విషయంలో ఓ స్కాం చేస్తున్నాడని దానికి సంబందించిన వివారాలను సేకరించమని చిన్నాకి చెప్తాడు. ఆ స్కాం ఏంటో కనుక్కోవడానికి రిస్క్ చేసిన చిన్నా గాయపడతాడు. గాయపడిన చిన్నాని డాక్టర్ చిన్ని(లావణ్య త్రిపాటి) కాపాడుతుంది.
ఆ కృతజ్ఞతతో చిన్నా చిన్నికి ఏమన్నా హెల్ప్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే చిన్నాకి డిల్లేశ్వరరావు వల్ల చిన్నికి ప్రాణాపాయం ఉందని తెలుసుకుంటాడు. దాంతో చిన్నా చిన్నిని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. అప్పుడే చిన్నాకి కొన్ని నిజాలు తెలుస్తాయి. చిన్నాకి తెలిసిన నిజమేమిటి? చివరికి చిన్నా చిన్నిని కాపాడాడా? లేదా? చిన్నా చిన్నతనంలో చేసిన ఆకతాయి పనేంటి? అసలు మంత్రి డిల్లేశ్వరరావు చిన్నిని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు చిన్నికి డిల్లేశ్వరరావుకి ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలుసు కోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
సినిమాకి హీరో మరియు సినిమా మొత్తం కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేసేది మంచు విష్ణునే. ఈ మూవీలో మంచు విష్ణు పాత్ర దాదాపు ‘డీ’, ‘దేనికైనా రెడీ’ సినిమాల్లో లానే ఉంటుంది. కానీ ఇందులో మంచు విష్ణు నటన ఇంకాస్త మెరుగుపడింది, అలాగే గత సినిమాలకంటే ఈ సినిమాలో మంచు విష్ణు రిస్క్ తీసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ మరియు డాన్సులు బాగా చేసాడు. ‘ముఖ్యంగా టైటిల్ సాంగ్ ‘దూసుకెళ్తా’ లో స్టెప్స్ బాగున్నాయి. లావణ్య త్రిపాటి సినిమాలో కాస్త అమాయకంగా చాలా బ్యూటిఫుల్ గా, ఓవరాల్ గా చూడటానికి ముద్దుగా ఉంది. అలాగే మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో కాస్త గ్లామరస్ గా కనిపించింది. లావణ్య చిన్ని పాత్రకి పూర్తి న్యాయం చేసింది.
వీర బ్రహ్మం గా బ్రహ్మానందం మరియు పిచ్చేశ్వర్ గా వెన్నెల కిషోర్ సినిమా మొత్తం ట్రావెల్ చెయ్యకపోయినా తెరపై కనిపించిన ప్రతిసారి బాగా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ లో పోసాని కృష్ణ మురళి అవతార్ గా కాసేపు నవ్వించారు. కోట శ్రీనివాసరావు పాత్రకి తగ్గట్టు నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పంకజ్ త్రిపాటి నటన బాగుంది.
సినిమాలో పాటలని బాగా రిచ్ గా షూట్ చేసారు. ముఖ్యంగా ‘అలేఖ్య’, టైటిల్ సాంగ్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా స్టార్టింగ్, అలాగే స్టార్టింగ్ లో వచ్చే రవితేజ వాయిస్ ఓవర్ మరియు ఇంటర్వల్ ట్విస్ట్ బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ కంటిన్యూగా లేకపోయినా మధ్య మధ్యలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ బాగున్నాయి. వీరూ పోట్ల రాసిన వన్ లైన్ డైలాగ్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా ఓవరాల్ గా మంచు విష్ణు చేసిన ‘డీ’, ‘దేనికైనా రెడీ’ మరియు వీరూ పోట్ల తీసిన ‘బిందాస్’ సినిమాకి దగ్గరగా ఉండడం వల్ల ఆ హిట్ సినిమాల ప్రభావం ఈ సినిమాపై ఉంటుంది. వాటిని పోల్చుకోకుండా చూస్తే చాలా బాగుందనిపిస్తుంది, అదే పోల్చుకుంటే మాత్రం జస్ట్ బాగుందనిపిస్తుంది. పైన చెప్పిన కొన్ని సినిమాల తరహాలోనే సెకండాఫ్ సాగడం వల్ల ఆడియన్స్ కి సినిమా రొటీన్ గా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ ఇంకాస్త వేగంగా ఉండాల్సింది. అలాగే సినిమాలో వచ్చే ట్విస్ట్ లన్నీ ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ చేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోవడం వల్ల సెకండాఫ్ కాస్త ఊహాజనితంగా ఉంటుంది. రఘుబాబు, మాస్టర్ భరత్, రావు రమేష్, ఆహుతి ప్రసాద్ పాత్రలను సరిగా వినియోగించుకోలేదు. విష్ణు – లావణ్య లవ్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. అలాగే లావణ్య – సామ్రాట్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ లో లాజిక్ అసలు ఉండదు.
సాంకేతిక విభాగం :
సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన ప్రతి ఫ్రేంని బాగా రిచ్ గా చూపించడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. దానివల్ల సినిమా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. తదుపరి చెప్పాల్సింది మణిశర్మ గురించి, పాటలు బాగున్నాయి, పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు సినిమాని నిలబెట్టింది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ జస్ట్ ఓకే అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.
వీరూ పోట్ల – గోపి మోహన్ కలిసి రాసుకున్న స్క్రీన్ ప్లే జస్ట్ యావరేజ్. ఇక వీరూ పోట్ల ఎంచుకున్న కథ చెప్పుకోదగినది కాపోయినా తను రాసుకున్న వన్ లైన్ డైలాగ్స్ మరియు డైరెక్షన్ టాలెంట్ తో సినిమాని బాగానే డీల్ చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘దూసుకెళ్తా’ సినిమా ఓవరాల్ గా దూసుకెళ్ళే అంత స్థాయిలో లేకపోయినా చూడటానికి మాత్రం బాగుంది. మంచు విష్ణుకి హిట్స్ ఇచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఫార్మాట్ లోనే తీసిన ఈ సినిమా కూడా చూడదగిన ఎంటర్టైనర్. మంచు విష్ణు నటన, యాక్షన్ ఎపిసోడ్స్, లావణ్య గ్లామర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కామెడీ చూడదగినవి అయితే స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, కామెడీ ఫుల్ గా లేకుండా అక్కడక్కడ మాత్రమే ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. చివరిగా ‘దూసుకెళ్తా’ మంచు విష్ణు తీసిన గత యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలంత లేకపోయినా ఓ సారి చూడదగిన ఎంటర్టైనింగ్ మూవీ.